: తలసాని టీడీపీ ఎమ్మెల్యేనా?..మరి మంత్రి ఎలా అయ్యారు?: విస్మయం వ్యక్తం చేసిన ప్రణబ్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేబినెట్ లో కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను పర్యవేక్షిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే అని తెలుసుకుని ఆయన విస్తుపోయారట. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని టీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ కేబినెట్ లో ఎలా మంత్రి అయ్యారని కూడా ఆయన ప్రశ్నించారట. అంతేకాక తలసాని మాదిరిగా ఇతర పార్టీలకు చెందిన ఇంకెంత మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారని కూడా ఆయన ఆరా తీశారు. పార్టీ ఫిరాయింపులపై నిన్న హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీని కలిసిన టీడీపీ నేతలు ఆయనకు ఓ వినతి పత్రం సమర్పించారు. దానిని సాంతం చదివిన ప్రణబ్ విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన తలసాని మంత్రి ఎలా అయ్యారని ఆయన టీ టీడీపీ నేతలను ప్రశ్నించారట. ఈ క్రమంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ చేపట్టిన ‘ఆకర్ష్’ మంత్రాన్ని టీ టీడీపీ నేతలు రాష్ట్రపతికి పూసగుచ్చినట్లు చెప్పారట. ఎన్నికల తర్వాత కేవలం 63 మంది సభ్యుల బలం ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుతం తమకు 83 మంది సభ్యుల బలం ఉన్నట్లు చెబుతోందని వారు ఫిర్యాదు చేశారు. అంతేకాక రాజ్యాంగ విరుద్ధంగా తమ పార్టీ టికెట్లపై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని వారు కోరారు. దీంతో స్పందించిన ప్రణబ్, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారట.