: మత్తయ్య సోదరుడిని కొట్టింది టీ పోలీసులేనట...కీలక ఆధారాలు సేకరించిన ఏపీ సీఐడీ


ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య సోదరుడు ప్రభుదాస్ పై భౌతిక దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్న విషయాన్ని ఏపీ సీఐడీ పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. కేసులో మత్తయ్యను భయభ్రాంతులకు గురిచేసే క్రమంలో తెలంగాణ పోలీసులే ఆయన కుటుంబ సభ్యులను బెదిరించడంతో పాటు ప్రభుదాస్ పై భౌతిక దాడి చేశారని ఏపీ సీఐడీ పోలీసులు తేల్చేశారు. అంతేకాక, మత్తయ్య సోదరుడితో పాటు ఆయన భార్యకు కూడా తెలంగాణ పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించిన విషయంపై కూడా పక్కా ఆధారాలు లభ్యమయ్యాయట. ఇక ఇలా ఫోన్లలో మత్తయ్య కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగిన వ్యక్తుల్లో టీఆర్ఎస్ నేతలూ ఉన్నారని ఏపీ సీఐడీ అధికారులు గుర్తించారు. మత్తయ్య కుటుంబ సభ్యుల మొబైల్ కాల్ డేటాను పరిశీలించిన సీఐడీ అధికారులకు పలువురు టీఆర్ఎస్ నేతల ఫోన్ నెంబర్లు కనిపించాయట. దీనికి సంబంధించి మరింత పక్కాగా ఆధారాలు సేకరించి, ఆ తర్వాత ముందడుగు వేయాలని ఏపీ సీఐడీ భావిస్తోంది. అంటే, మునుముందు ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News