: తెలంగాణలో టీడీపీ అధికారంలోకొస్తే రేవంత్ రెడ్డే సీఎం: కొత్తకోట దయాకర్ రెడ్డి
తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే, రేవంత్ రెడ్డి సీఎం అవుతారట. ఈ మేరకు నిన్న ఆ పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే, సీఎం పోస్టుకు ఎంపికయ్యే నేతల్లో రేవంత్ రెడ్డి ముందువరుసలో ఉంటారని దయాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న పాలమూరు జిల్లా కొడంగల్ వచ్చిన దయాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో 11 నెలల్లో తెలంగాణలో కేసీఆర్ సాగిస్తున్న నియంత పాలన అంతమవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని చెప్పిన దయాకర్ రెడ్డి, ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకనే కేసీఆర్ కేసుల పేరిట నాటకాలాడుతున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీలో పదవులు అనుభవించిన కేసీఆర్, ప్రస్తుతం తిన్నింటి వాసాలు లెక్కించే మాదిరిగా వ్యవహరిస్తున్నారని దయాకర్ రెడ్డి ఆరోపించారు.