: ఏపీలో భారీ బొగ్గు కుంభకోణం...పెద్దబాస్, చిన్నబాస్ రూ.1,000 కోట్లు దండుకున్నారు: రఘువీరా
ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కొద్దిసేపటి క్రితం ఏపీ సర్కారుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో భారీ బొగ్గు కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్త ఆదానీకి భారీ కాంట్రాక్టును కొనసాగించడం ద్వారా సర్కారీ ఖజానాకు పెద్ద ఎత్తున గండి పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఆదానీ గ్రూపు నుంచి పెద్దబాస్, చిన్నబాస్ లు రూ.1,000 కోట్లు వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై నిజాలను నిగ్గు తేల్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు అఖిలపక్షాన్ని వేసి తన నిజాయతీని నిరూపించుకోవాలని రఘువీరా డిమాండ్ చేశారు. మరి తాను పేర్కొన్న పెద్దబాస్, చిన్నబాస్ లు ఎవరన్న విషయాన్ని మాత్రం రఘువీరా వెల్లడించలేదు.