: దీన స్థితిలో జాతీయ బాక్సర్
జాతీయ బాక్సింగ్ లో స్వర్ణ పతక విజేత ఇప్పుడు స్వీపర్ గా బతుకీడుస్తున్నాడు. బాక్సింగ్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించినా బతుకు పోరాటంలో అష్టకష్టాలు పడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మాజీ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ కృష్ణ రౌత్ (43) 1987లో జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. 1992లో వెండిపతకం సాధించాడు. హౌరా మున్సిపల్ కార్పొరేషన్ లో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత పదేళ్లుగా డ్రైనేజీల్లో మందు చల్లే వ్యక్తిగా, అంతకు ముందు ఐదేళ్లు స్వీపర్ గా పని చేశాడు. తన దుస్థితి ఎవరికీ రాకూడదని ఆకాంక్షిస్తున్న కృష్ణ రౌత్, ఉద్యోగం కోసం ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలుస్తానని చెప్పాడు. రోజుకు 232 రూపాయల వేతనంతో ఆరుగురు సభ్యులు గల కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉందని, తన సోదరుడుకి టీబీ సోకిందని, వైద్యం చేయించాలని ఆయన పేర్కొన్నారు. ఇంత ఇబ్బందిలో కూడా కృష్ణ రౌత్ నిరుపేదలైన 150 మంది పిల్లలకు ప్రతి రోజూ బాక్సింగ్ నేర్పించడం విశేషం.