: కొండెంగలు వస్తే కోతులు సభ పెట్టి 'విప్లవం జిందాబాద్' అంటున్నాయ్: నవ్వులు పూయించిన కేసీఆర్
అడవుల్లోను, ఊరిబయట చెట్లపైన ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి రావడానికి మనం చేసిన తప్పులే కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మధ్యాహ్నం సిద్దిపేటలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, కోతుల కథ చెప్పారు. "వాన కురవమంటే కురవాలె... కోతి వాపస్ పొమ్మంటే పోవాలె. కోతులు... ఎవళ్లు మాట్లాడినా కోతులను పట్టీయాలె సార్ అంటుర్రు. ఏ ఊర్లకి బోయినా కోతులను పట్టి ఎల్లగొట్టీయాలె సార్... కోతి అనుమంతుడని మొక్కుతం, దాన్నేమో కొట్టం. కొడదామంటే బాధ. పట్టీయాలె. కొండెంగను (కొండముచ్చు) తీస్కచ్చి పెట్టిర్రు. కోతులు సభ పెట్టుకున్నై. సభపెట్టుకొని అవి కూడా 'విప్లవం జిందాబాద్' అన్నై. కొండెంగ ఒక్కటేగదా నీయమ్మ, మనం నూరుమందిమున్నం, కొడితే బోవాలె కొండెంగ అన్జెప్పి అవి ఎదురుదాడి చేత్తున్నై ఈ మధ్య. కొండెంగలనే కొట్టి ఎల్లగొడుతున్నై చాలా ఊర్లల్లో. కాబట్టి అట్లా కొండెంగను దెస్తే లాభం లేదు. మనమీయాళ కోతి ఎందుకచ్చింది ఊరిమీదకి? ఏ యాదగిరిగుట్టకో, ఏడికో దేవుడికాడికో పోతే కనబడేది కోతి మనకు. కోతులు ఆడింపించేటోళ్లు గూడా మన ఊళ్లెంబడి వచ్చేది. అటువంటి కోతులు మందలకు మందలు వచ్చి ఊళ్లమీద బడుతున్నై. ఎందుకు బడుతున్నై? అవి ఉండే జాగాను మనం ఖరాబు చేసినం. మన జాగాలోకి అవెళ్తన్నై" అని తనదైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ, ప్రజలను నవ్విస్తూ, అందరూ మొక్కలు నాటి చెట్లు పెంచాలని, అడవులను తయారు చేయాలని చెప్పారు. ఇది తాను చెప్పే కథ కాదని, సత్యమని అన్నారు.