: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ పెట్టిన 'ఎర్రబస్సు'!
విభజన తరువాత తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఎన్నో గొడవలకు పరిష్కారం ఇంకా లభించలేదు. తాజాగా మరో గొడవ 'ఎర్రబస్సు' రూపంలో వచ్చింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఒక ప్రాంత బస్సులను మరో ప్రాంతంలోకి రానివ్వని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసి సర్వీసుల్లో ఏపీ విద్యార్థుల పాస్‌లను అనుమతించడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులు పాఠశాలలు తిరిగి తెరచినా వెళ్లలేకపోతున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్ పాస్ లు జారీ చేయగా, వాటిని తెలంగాణ డిపోలకు చెందిన బస్సుల్లో అంగీకరించడం లేదు. దీంతో తమ ప్రాంతంలో టీ-బస్సులు వద్దని వాటిని తిప్పిపంపేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీరంతా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇప్పటివరకూ స్పందించక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే విధమైన సమస్య నల్గొండ జిల్లాలోని కోదాడ, కృష్ణా జిల్లాలోని నందిగామ మధ్య, కర్నూలు, మహబూబ్ నగర్ సరిహద్దుల్లోనూ నెలకొంది.