: బంగారం ధరలు తగ్గినా ఆభరణాలు కొనేవారు లేరు!


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలతో పోలిస్తే, ఇండియాలో బంగారం ధర తగ్గిపోయింది. సాధారణంగా ఔన్సు బంగారం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత పలుకుతుందో దానికి ఒక డాలర్ (సుమారు రూ. 63) అటూ ఇటుగా ఇండియా మార్కెట్లో ధర ఉంటుంది. కానీ, ఇప్పుడు వివిధ నగరాల్లో 8 నుంచి 15 డాలర్ల (సుమారు రూ. 500 నుంచి రూ. 950) డిస్కౌంట్ ధరకు బంగారం లభిస్తోంది. అయినప్పటికీ ఆభరణాల అమ్మకాలు అత్యంత మందకొడిగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో టాప్-2గా ఉన్న ఇండియాలో బంగారం ధర మూడున్నర నెలల కనిష్ఠ స్థాయిలో వుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తో పోలిస్తే 3 శాతం తక్కువగా ఉంది. ధరలు తగ్గినప్పటికీ, కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్ రాజ్ బామల్వా వ్యాఖ్యానించారు. భారతావనిలో శుభకార్యాలు జరగకపోవడం ఇందుకు ప్రధాన కారణమని, పండగ సీజనుకు ఇంకా సమయం ఉండడం, రుతుపవనాల రాకతో రైతులు పొలం పనుల్లో కాలం గడుపుతూ, పెట్టుబడి పెడుతుండడం బులియన్ డిమాండ్ ను తగ్గించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగస్టు తరువాత పరిస్థితి మారుతుందని భావిస్తున్నామని, డిసెంబర్ నాటికి ధరలు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. బంగారం దిగుమతి పెరగడం కూడా ధరలపై ఒత్తిడిని తెస్తోందని వివరించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు అమెరికన్ మార్కెట్ తో పోలిస్తే డిస్కౌంటుల్లోనే నడుస్తున్నాయి. సింగపూర్ లో ఔన్సు బంగారం ధరపై 80 సెంట్ల నుంచి 1.20 డాలర్ల ప్రీమియం లభిస్తుండగా, హాంకాంగ్ లో 60 సెంట్ల నుంచి ఒక డాలర్ తక్కువకు బంగారం లభిస్తోంది.

  • Loading...

More Telugu News