: జోకులు పేల్చిన వెంకయ్యనాయుడు
అమెరికాలో జరుగుతున్న 'తానా' వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో జోకులు పేల్చి ప్రవాసాంధ్రులను నవ్వుల్లో ముంచెత్తారు. తనవంటి వారికి దేశాలు తిరగడం తప్ప మరో పని లేదని అంటూ, "నా కూతుళ్లు అంటుంటారు... అన్ని చోట్లకూ వెళ్లినట్టే అప్పుడప్పుడూ మా నాన్న ఇంటికి కూడా వస్తుంటారని. ఇక మా ఆవిడ అంటుంది... రోజూ టీవీలో చూసుకుంటాను అని... మా మనవలు, మనవరాళ్లు 'టీవీ తాతయ్య' అని పిలుస్తుంటారు" అంటూ నవ్వులు పూయించారు. అమ్మ, నాన్న, తాతయ్య, పిన్నమ్మ, బాబాయ్, నానమ్మ అని పిలిస్తే వచ్చే మాధుర్యం మమ్మీ, డాడీ, ఆంటీ అంటే ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. తెలుగువారు ఎక్కడున్నా కలిసుండాలని, పెట్టుబడులు పెట్టాలనుకునే వారు తెలుగు రాష్ట్రాలకే రావాలని ఆయన పిలుపునిచ్చారు.