: మీరేంటో మీ సెల్ఫీ ఇట్టే చెప్పేస్తుంది!
సోషల్ మీడియాలో సెల్ఫీల రాజ్యం నడుస్తోంది. ఏం చేసినా ఓ సెల్పీ తీసుకోవడం దానిని అకౌంట్లో అప్ లోడ్ చేయడం, లైకులు, కామెంట్ల లెక్క చూసుకోవడం యువత ప్రధాన వ్యాపకంగా మారింది. అయితే సెల్ఫీలంటే ఫోటోలే కాదు, మన ఆలోచనా విధానం కూడా అని నిపుణులు చెబుతున్నారు. సింగపూర్ కు చెందిన నన్ యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు సెల్ఫీలు ఎన్నో ఊసులు చెబుతాయని అంటున్నారు. మీ వ్యక్తిత్వం ఏమిటో మీ సెల్ఫీ చెబుతుందని వారు పేర్కొంటున్నారు. సెల్ఫీ కోసం ఎంచుకున్న ప్రదేశం, భంగిమ, కెమెరా పెట్టిన విధానం... వంటి వన్నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని వారు చెబుతున్నారు. సెల్ఫీని చూసి వ్యక్తిత్వం అంచనా వేయవచ్చని వారు పేర్కొంటున్నారు. నవ్వుతూ సెల్పీ తీసుకోవడం సిగ్నేచర్ లుక్ అయితే, అది సానుకూల దృక్పథాన్ని చూపుతుందని వారు తెలిపారు. కెమెరా కిందనుంచి సెల్పీ తీసుకోవడం వారి పట్టువిడుపు లేని ధోరణిని, సరికొత్త ప్రయోగాత్మక దృక్పథాన్ని తెలియజేస్తుందని వారు వెల్లడించారు. ప్రైవేటు ప్లేస్ లో సెల్ఫీ తీసుకోకపోవడం మనస్సాక్షిని తెలియజేస్తుందని వారు పేర్కొన్నారు.