: ఎయిర్ టెల్ ను కాపాడిన ఆ రెండు రోజులు... లేకుంటేనా?: సునీల్ మిట్టల్
ఎయిర్ టెల్... ఇండియాలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన భారతీ ఎంటర్ ప్రైజస్ కిరీటంలో ఓ విలువైన రత్నం. దీన్ని స్థాపించిన సునీల్ భారతీ మిట్టల్ ఎంతో శ్రమించి పైకి తీసుకొచ్చి, ఇండియాలో నంబర్ వన్ టెలికం సంస్థగా నిలిపాడు. దీని వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఇటీవల ఆయన ఫ్యూచర్ గ్రూప్ 'రీబార్న్' ఈవెంట్ లో తన సందేశాన్ని వినిపిస్తూ, భారతీ ఎయిర్ టెల్ దాదాపు కుప్పకూలే స్థితి నుంచి తిరిగి ఎలా లేచి నిలబడిందన్న కథను వివరించారు. "2002లో ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్, మరోవైపు కొన్ని ప్రైవేటు టెల్కోలు ఇండియాలో సెల్ ఫోన్ సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన సమయం నాకు బాగా గుర్తుంది. ఆ సమయంలో ఎయిర్ టెల్ పతనం అయిపోయినట్టేనన్న అంచనాలు, వార్తలు వచ్చాయి. ఎప్పుడు సంస్థ పడిపోతుందన్నదే ప్రశ్న. ఆ సమయం కాస్తంత ఇబ్బందుల్లోనే ఉన్నట్టు. అప్పుడు నైపుణ్యమున్న యువత మా వెనుక ఉద్యోగుల రూపంలో అండగా నిలిచారు. ఉన్నది చిన్న టీమే అయినా, రెండు రోజుల పాటు చర్చించి భవిష్యత్ వ్యూహాలను రచించాం. ఆ రెండు రోజుల్లో నిలువెత్తు నీళ్లల్లో మునిగి తలమాత్రమే పైకి పెట్టి ఉన్నట్లుంది మా పరిస్థితి. మార్కెట్లో పెద్ద ప్లేయర్ల మధ్య ఎలా నెగ్గుకురావాలన్న విషయంలో ఎన్నో చర్చలు జరిపి, ఆపై నిర్ణయాల అమలుకు ఎంతో శ్రమించాం. దీంతో మరోసారి జన్మించినట్లయింది" అన్నారు. ఆ రెండు రోజులూ విఫలమైతే ఎయిర్ టెల్ పతనమై ఉండేదని అభిప్రాయపడ్డారు. ఓ హార్డ్ వేర్ సంస్థగా ఉన్న ఐబీఎం సాఫ్ట్ వేర్ జయింట్ గా ఎదిగినట్టుగా తమ సంస్థ తిరిగి నిలబడిందని ఆయన అన్నారు.