: డీఎస్పీతో భూమా అఖిలప్రియ వాగ్వాదం...నంద్యాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ఏపీలో ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలు నంద్యాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ముందుగా ఓటేసిన అఖిలప్రియ, తన తండ్రి భూమా నాగిరెడ్డి కోసం పోలింగ్ కేంద్ర వద్ద వేచి ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన డీఎస్పీ, ‘‘ఓటు వేశారుగా... ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలప్రియ, తాను తన తండ్రి కోసం వేచి చూస్తున్నానని ఘాటుగా బదులిచ్చారు. అంతేకాక ఎమ్మెల్యే అయిన తనను వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరంటూ ఆమె డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.