: నిధుల కొరతతో తెలంగాణ అల్లాడుతోందట... మిగులు బడ్జెట్ ఏమయ్యిందో!


రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ తో ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోగా, తెలంగాణ మాత్రం మిగులు బడ్జెట్ తో కనిపించింది. లక్ష కోట్లకు పైగా భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇక అనుకున్న మేరకే ఆదాయం కూడా వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఆ రాష్ట్రం నిధుల కొరతతో అల్లల్లాడిపోతోందట. జూన్ మాసానికి సంబంధించి బిల్లుల చెల్లింపుకూ నానా తంటాలు పడుతోందట. అదేంటీ, మిగులు బడ్జెట్ తో పాటు ఆదాయం కూడా అంచనాలకు మించి వస్తే ఇబ్బంది ఏమిటనేగా మీ ప్రశ్న? అదే విషయాన్ని పరిశీలిస్తే, ఓ చిన్న విషయం ఈ మొత్తం ఇబ్బందికి కారణంగా నిలుస్తోందని తేలింది. అసలు విషయానికొస్తే... ఎక్సైజ్ అమ్మకాలపై ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో తెలంగాణ సర్కారు ఖాతా నుంచి కేంద్ర ఐటీ శాఖ రూ.1,260 కోట్లను ఉన్నపళంగా లాగేసిందట. దీంతోనే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ క్రమశిక్షణలో ప్రధానమైన ‘వేస్ అండ్ మీన్స్ (రాబడి- చెల్లింపులు)’ పరిస్థితి ప్రమాదంలో పడింది. ఈ కారణంగానే సదరు రూ.1,260 కోట్లు తిరిగి తన ఖాతాలో చేరితే కాని తెలంగాణ సర్కారు జూన్ మాసం బిల్లులను చెల్లించే పరిస్థితి లేదు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మలు కేంద్రాన్ని శరణువేడారు. ఐటీ శాఖ లాగేసుకున్న రూ.1,260 కోట్ల నిధులను తక్షణమే సర్దుబాటు చేయకపోతే తమ ఆర్థిక పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ సర్కారు కేంద్రం ముందు తమ వాదనను వినిపించింది. దీంతో పరిస్థితిని అంచనా వేసిన కేంద్ర ఆర్థిక శాఖ ‘సరేలే, చూద్దాం’ అంటూ మాటమాత్రంగా హామీ ఇచ్చిందట. అయితే నిధుల సర్దుబాటుపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయిందని సమాచారం. చివరకు అడ్వాన్స్ రూపంగానైనా సదరు రూ.1,260 నిధులను సర్దుబాటు చేయాలని తెలంగాణ సర్కారు చేస్తున్న అభ్యర్థనపై కేంద్రం సానుకూలంగానే స్పందించిందని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News