: కొత్తవారి కోసం త్యాగాలు తప్పవన్న కేసీఆర్...పదవీగండంతో టీ మంత్రుల బెంబేలు!
టీఆర్ఎస్ ఆకర్ష్ కు అటు టీడీపీ నుంచే కాక ఇటు కాంగ్రెస్ నుంచి కూడా భారీ స్పందనే వస్తోంది. మరి ఆయా పార్టీల నుంచి వస్తున్న పెద్ద నేతలను సంతృప్తిపరిచేందుకు పదవుల అప్పగింత కూడా తప్పనిసరి కదా. కొత్తవారికి పదవులిస్తే, పాత వారికి ఉద్వాసన తప్పదన్న విషయం కూడా తెలిసిందే. ఇదే విషయాన్ని నిన్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ సీనియర్ల వద్ద ప్రస్తావించారట. కొత్తవారికి పదవులివ్వాలంటే, పాతవారు త్యాగాలు చేయాల్సిందేనన్న ఆయన నర్మగర్భ వ్యాఖ్యలతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆందోళనలో పడిపోయారట. ఇప్పటికే పార్టీలోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, కడియం శ్రీహరిలకు కేసీఆర్ పెద్ద పీటే వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కూడా కారెక్కనున్నారు. ఇక ఆయనకు కూడా మండలి సీటు, మంత్రి పదవి ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ త్యాగం వ్యాఖ్యలు చేశారని భావిస్తున్న తెలంగాణ మంత్రులు, వేటు ఎవరిపై పడుతుందోనన్న భావనతో బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాక త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేబినెట్ లో మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని, అప్పటిదాకా తమ పదవులు సేఫేనని కూడా కొంతమంది మంత్రులు తమ అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారట.