: బీసీసీఐ గుర్తించని మట్టిలో మాణిక్యాన్ని ఒమన్ సెలక్టర్లు గుర్తించారు!


భారత్ లో ఎందరో ప్రతిభావంతులున్నా, అందరికీ జాతీయ జట్టులో ఆడాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నా, కొందరికే అవకాశం వస్తుంది. నైపుణ్యం ఉన్నా, సరైన వేదిక లేక మరుగున పడిపోతున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. కొందరు క్రికెట్ ను వదిలి వేరే వ్యాపకాలు చూసుకుంటుండగా, మరికొందరు విదేశాల్లో తమ కెరీర్ కు బాటలు వేసుకుంటున్నారు. మునీస్ అన్సారీ కూడా అలాంటి క్రికెటరే. మధ్యప్రదేశ్ లోని సెహోర్ ప్రాంతానికి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఒమన్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. టి20 వరల్డ్ కప్ బెర్తు కోసం కోసం ఒమన్ జట్టు కూడా పోటీపడుతోంది. క్వాలిఫయర్స్ ఆడేందుకు ఎంపిక చేసిన జట్టులో ఈ యువ క్రికెటర్ కు కూడా స్థానం కల్పించారు ఒమన్ క్రికెట్ బోర్డు సెలక్టర్లు. అన్సారీ క్రికెట్ ప్రస్థానం ఆసక్తిదాయకం. సెహోర్ ప్రాంతానికి చెందిన ఈ మధ్యతరగతి యువకుడు రోజూ 8 గంటల పాటు ప్రాక్టీసు చేసేవాడు. క్రికెట్ అంటే అంత పిచ్చి! కొన్నాళ్ల కిందట భారత్ లో నిర్వహించిన స్పీడ్ స్టార్ కాంటెస్ట్ లో పాల్గొన్న అన్సారీ, గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా, ఈ పోటీలో టీమిండియా స్టార్ హర్భజన్ సింగ్ ను ఇబ్బందుల పాల్జేశాడు. అన్సారీ విసిరిన తొలి బంతికి భజ్జీ క్లీన్ బౌల్డయ్యాడు. రెండో బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది. మూడో బంతిని కొట్టే క్రమంలో భజ్జీ చేతి నుంచి బ్యాట్ జారిపోయింది. అదీ ఆ యువ పేసర్ సత్తా! సచిన్, అక్రమ్, జాంటీ రోడ్స్, అజయ్ జడేజా వంటి ఉద్ధండులను సైతం ఆకట్టుకున్న అన్సారీ పేస్ ను మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం గుర్తించలేకపోయింది. దాంతో, రంజీల్లో ఆడే అవకాశం లభించలేదు. అటు, బీసీసీఐ కూడా తన టాలెంట్ ను సీరియస్ గా తీసుకోకపోవడంతో, అన్సారీ గల్ఫ్ బాటపట్టాడు. సౌదీ అరేబియాలోనూ, దాని పొరుగు దేశాల్లోనూ కార్పొరేట్ టోర్నీల్లో ఆడుతూ ప్రతిభకు మరింత పదునుపెట్టుకున్నాడు. ఇటీవలే ఒమన్ లో ఓ ప్రాక్టీసు మ్యాచ్ లో పది వికెట్లు సాధించడంతో అక్కడి సెలక్టర్లు అచ్చెరువొందారు. వెంటనే అతడిని కాంట్రాక్టు పద్ధతిన జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News