: డీఎస్ వెళ్లడం వలన కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదు: టీ.కాంగ్రెస్ నేతలు
సీనియర్ నేత డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడడంవల్ల తమకు ఎలాంటి నష్టం లేదని టీ.కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ మేరకు టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలు మీడియాతో మాట్లాడారు. పదవి లేకుండా డీఎస్ నెల రోజులు కూడా ఉండలేకపోయారన్నారు. తనను దూషించిన కేసీఆర్ వద్దకే ఇప్పుడాయన వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రతిసారీ పెద్ద పదవులు తనకే ఉండాలనడం డీఎస్ స్థాయి వ్యక్తికి సరికాదన్నారు. ఆయనకు పార్టీ ఉన్నత పదవులు ఇచ్చిందని, పార్టీలో సముచిత గౌరవమే దక్కిందని ఉత్తమ్ పేర్కొన్నారు. డీఎస్ కు ఎమ్మెల్సీ ఇస్తేనే సీనియర్స్ కు గౌరవం ఇచ్చినట్లా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. డీఎస్ పార్టీని వీడడం బాధాకరమని, ఆయనది అనాలోచిత నిర్ణయమని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఆయన రాజీనామా చేయడం తన తల్లిదండ్రులను అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా తాను పార్టీ సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. ఇక తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని జానారెడ్డి చెప్పారు.