: సీఎం కేసీఆర్ నే రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారు: సుప్రీంకోర్టులో టీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) నేటి ఉదయం సుప్రీంకోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి సాక్షాత్తు సీఎం కేసీఆర్ నే అంతుచూస్తానని బెదిరిస్తున్నారని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ రాగానే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే, కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేయడని గ్యారెంటీ ఏమిటని ఏఏజీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. నిన్న బెయిల్ పై విడుదలైన సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పైనే కాక తెలంగాణ మంత్రులపైనా పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సదరు వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో, వీడియో టేపులను తీసుకుని మరీ తెలంగాణ ఏఏజీ ఢిల్లీ వెళ్లారు. రేవంత్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ కు ఈ ఆడియో, వీడియో కాపీలను ఆయన సాక్ష్యంగా జతచేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పిటీషన్ పై రేపు కోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.