: మరోమారు తెరపైకి అనంతస్వర్ణమయం...బంగారం వివరాలపై టీటీడీ ఈఓకు భక్తుల దరఖాస్తు


తిరుమల వెంకన్న ఆలయానికి స్వర్ణతాపడం ప్రాజెక్టు ‘అనంతస్వర్ణమయం’ మరోమారు తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు కోసం విరాళమిచ్చిన బంగారాన్ని ఏం చేశారో తెలపాలని భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ సాంబశివరావును కోరారు. ఈ మేరకు కొంతమంది భక్తులు ఈవోకు లేఖలు రాశారని విశ్వసనీయ సమాచారం. 2008లో అప్పటి టీటీడీ చైర్మన్, దివంగత నేత డీకే ఆదికేశవులునాయుడు హయాంలో వెంకన్న ఆలయానికి బంగారుతాపడం కోసం అనంతస్వర్ణమయం పేరిట ప్రత్యేకంగా ప్రాజెక్టును చేపట్టారు. టీటీడీ చైర్మన్ హోదాలో ఆదికేశవులునాయుడు పిలుపు మేరకు నాడు భక్తులు 200 కిలోల బంగారాన్ని ఆలయానికి విరాళమిచ్చారు. కొంతకాలం పాటు పనులు జరిగినా, 2011లో ఆలయం గోడలకు ముప్పుందని చెప్పిన అప్పటి ఈఓ, పాలకవర్గం సభ్యులు పనులను ఉన్నపళంగా నిలిపివేశారు. అయితే పనుల కోసం వినియోగించగా, మిగిలిన బంగారాన్ని ఏం చేశారన్న విషయాలను మాత్రం ఈఓ గాని, పాలక మండలి కాని వెల్లడించలేదు. దీనిపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా, సమాధానమివ్వడంలో టీటీడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపించాయి. తాజాగా భక్తుల ఫిర్యాదులకు స్పందించిన ప్రస్తుత ఈఓ సాంబశివరావు, త్వరలోనే ‘స్వర్ణమయం’ బంగారం వివరాలను వెల్లడిస్తామని సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News