: ‘ఏపీ వైబ్రాంట్’ ఆహ్వాన ఖర్చు రూ.70 కోట్లట!... ఆంగ్ల దినపత్రికకు భారీ ఆఫర్
గుజరాత్ వైబ్రాంట్ సదస్సు తరహాలో ‘ఆంధ్రప్రదేశ్ వైబ్రాంట్’ నిర్వహణకు ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ఈ సదస్సును నిర్వహించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలను రప్పించి, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టమే ఈ సదస్సు లక్ష్యం. ఇందులో భాగంగా విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమే కాక సదస్సుకు మీడియాలో కవరేజ్ ను ఏపీ సర్కారు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు అప్పగించింది. ఇందుకోసం సదరు సంస్థకు రూ.70 కోట్లను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందని విశ్వసనీయ సమాచారం. కేవలం పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం, సదస్సుకు మీడియాలో ప్రచారం కల్పించడం, మీడియా మేనేజ్ మెంట్ తదితర బాధ్యతలను మాత్రమే సదరు ఆంగ్ల దినపత్రిక చేపడుతుందట. ఈ మాత్రం దానికే సదరు పత్రికకు రూ.70 కోట్లు ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.