: పుష్కరాల పనులు, ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
గోదావరి పుష్కరాల పనులు, ఏర్పాట్లలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుష్కరాలు జాతీయ ఉత్సవమని, అందరూ కష్టపడి పనిచేసి విజయవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు రాజమండ్రిలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో మంత్రులు, అధికారులతో సమావేశమైన సీఎం పుష్కరాల పనులపై సమీక్షించారు. పుష్కరాలకు 12 రోజులు మాత్రమే ఉండటంతో అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ, కార్యనిర్వాహక, రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి అనే మూడు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కమిటీలతో పుష్కర పనులపై నిరంతరం సమీక్షిస్తామన్నారు. స్థానికంగా నాలుగో వంతెన ప్రారంభించకుండానే రహదారి దెబ్బతినడంపై చంద్రబాబు మండిపడ్డారు. దెబ్బతిన్న రహదారులపై గామన్ సంస్థను హెచ్చరించారు. అంతటితో రాజమండ్రి పర్యటన ముగించుకున్న సీఎం పశ్చిమగోదావరి జిల్లా బయలుదేరారు.