: డీఎస్ తనను కలిశాడన్న వార్తలను ఖండించిన కేకే
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. డీఎస్ కాంగ్రెస్ ను వీడి, టీఆర్ఎస్ లో చేరతారని, అంతేగాకుండా, ఆయన టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుతో భేటీ అయ్యారని కూడా మీడియాలో వచ్చింది. దీనిపై కేకే స్పందించారు. తన నివాసానికి డీఎస్ రాలేదని, తనను కలవలేదని స్పష్టం చేశారు. డీఎస్ తనను కలిశాడంటూ వచ్చిన మీడియా కథనాలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజంలేదన్నారు. ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం పట్ల అలకబూనిన డీఎస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు లేఖ రాయడం తెలిసిందే. దీంతో, ఆయన పార్టీ మారతారంటూ ఊహాగానాలు షికారు చేశాయి.