: వింబుల్డన్ టోర్నీలో పక్షి కాపలా!
బ్రిటన్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో ఓ పక్షి ప్రముఖంగా కనిపిస్తుంది. దాని పేరు రూఫస్. ఇది హ్యారిస్ హాక్ జాతికి చెందిన పక్షి. దీని పనల్లా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ కు చెందిన టెన్నిస్ కోర్టుల్లో వాలేందుకు వచ్చే పక్షులను తరమడమే. టెన్నిస్ కోర్టుల్లోని పచ్చిక చూసి కిందికి దిగాలని చాలా పక్షులు భావిస్తాయని, తద్వారా ఆటకు అంతరాయం కలగడగమే గాకుండా, వాటి రెట్టలతో కోర్టు సౌందర్యం దెబ్బతింటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ప్రత్యేక శిక్షణ పొందిన రూఫస్ ను మోహరించారు. ఈ గ్రద్ద జాతికి చెందిన పక్షి వేరే పక్షులను కింద వాలనీయకుండా తరిమేస్తుంది. పదునైన కాలి గోళ్లు, వాడిగా ఉండే ముక్కును కలిగివున్న ఈ పక్షితో పోరాటానికి ఇతర పక్షులు సాహసించవన్న విషయం గుర్తించిన నిర్వాహకులు, గత ఐదేళ్లుగా వింబుల్డన్ టోర్నీ సమయంలో దీని సేవలు వినియోగించుకుంటున్నారు. అన్నట్టు... టోర్నీ అయిపోగానే ఈ పక్షి ఇతర అసైన్ మెంట్లను ఒప్పుకుంటుంది. లండన్ లో పక్షుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లోనూ, ఆసుపత్రుల వద్ద తన తడాఖా చూపిస్తుంది.