: భారత్ ను రచ్చకీడ్చేందుకు పాక్ ప్రయత్నం
అంతర్జాతీయ సమాజంలో తమను దోషిగా నిలబెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఎప్పటినుంచో గుర్రుగా ఉన్న పాకిస్థాన్ కొన్నాళ్లుగా ప్రత్యారోపణలతో విరుచుకుపడుతోంది. దేశంలో అస్థిరతకు కారణం భారత్ కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అని ఇటీవలే ఆరోపించింది కూడా. ఈ క్రమంలో భారత్ ను రచ్చకీడ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ ముత్తాహిదా క్వామి మూవ్ మెంట్ (ఎంక్యూఎం)కు నిధులు అందిస్తోందని, తద్వారా కరాచీలో అస్థిరత సృష్టించాలని భావిస్తోందని పాక్ ఆరోపించింది. ఈ విషయమై ఐక్యరాజ్యసమితిలో భారత్ ను దోషిగా నిలపాలని గట్టిగా నిర్ణయించుకుంది. అటు, తమకు భారత నిఘా సంస్థ 'రా'తో ఎలాంటి సంబంధాలు లేవని, భారత్ నుంచి తామెలాంటి నిధులు అందుకోలేదని ఎంక్యూఎం వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ స్పష్టం చేశారు. అయితే, భారత్ ఎంక్యూఎంకు నిధులు ఇచ్చిందన్న విషయమై తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని పాక్ చెబుతోంది. తమకు భారత్ నుంచి నిధులు అందాయని లండన్ లో ఇద్దరు ఎంక్యూఎం నేతలు మెట్రోపాలిటన్ పోలీస్ విభాగానికి చెప్పారని, దానికి సంబంధించిన స్టేట్ మెంట్ ప్రతుల కోసం బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాశామని పాక్ తెలిపింది. ఈ క్రమంలోనే ఐరాసలో తన రాయబారి మలీహా లోథీని ఇస్లామాబాద్ పిలిపించింది పాక్ సర్కారు. ఆమెతో ఈ విషయమై కూలంకషంగా చర్చించింది. కాగా, పాక్ చేస్తున్న ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. పాకిస్థాన్ వ్యవహారాల్లో తామెలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది.