: హైదరాబాద్ లో ఏపీ పోలీస్ స్టేషన్లు అవసరమే!: గాలి ముద్దుకృష్ణమ
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై రెండు రాష్ట్రాలకు హక్కు ఉందని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా టీ.ఏసీబీ అధికారులు తప్పుడు కేసులతో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే హైదరాబాద్ లో ఏపీ పోలీస్ స్టేషన్లు కూడా అవసరమని నొక్కి చెప్పారు. ఏపీ ఉద్యోగులు తప్పులు చేస్తే కేసులు ఎక్కడ పెట్టాలి? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గాలి మాట్లాడారు. సెక్షన్ 8 కింద గవర్నర్ కు విచక్షణాధికారాలు ఉన్నాయని, షెడ్యూల్ 9, 10 కింద ఏపీకి కూడా వాటా, హక్కు ఉన్నాయని ముద్దుకృష్ణమ స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ ఇవన్నీ తమవే అంటున్నారని మండిపడ్డారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లపై స్పష్టమైన ఆధారాలున్నాయని, ట్యాపింగ్ కేసులో సీఎం కేసీఆర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కేసులో మొదటి ముద్దాయి కేసీఆర్ అయితే, రెండో ముద్దాయి స్టీఫెన్ సన్ అని అన్నారు.