: రుతుపవనాలు వచ్చేశాయి... నిర్లక్ష్యంతో వాహనాల క్లయిములు కోల్పోవద్దు!


"వర్షాకాలంలో వాహన బీమా క్లయిములు అధికంగా వస్తుంటాయి. వర్షాల కారణంగా రహదారులు సరిగ్గా కనపడక ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. రోడ్లు పాడైపోయి, ఇంజన్లలోకి నీరుచేరి వాహనాలు పాడైపోతుంటాయి. ఈ తరహా ఘటనల్లో బీమా క్లయిములు చేసేముందు కస్టమర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న సందర్భాల్లో చూపే నిర్లక్ష్యం కారణంగా వాహనాలకు జరిగే మరమ్మతుల క్లయిములు పొందలేరు" అని బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ విజయ్ కుమార్ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, ఇంజనులో నీరు చేరి వాహనం పాడుకావడం ఈ కాలంలో సర్వసాధారణంగా జరిగేదే. వర్షం పడితే నీరు చేరే ప్రాంతాల్లో వాహనాన్ని ఉంచితే బీమా వర్తించక పోవచ్చు. అపార్టుమెంట్ బేస్ మెంటులో వాహనాన్ని ఉంచిన సందర్భంలో నీరు చేరి మొరాయిస్తే, బీమా నిబంధనల ప్రకారం వాహనాన్ని బయటకు తీసుకురావడానికి రూ. 1500, అక్కడికక్కడే వాహనం పరిశీలన నిమిత్తం రూ. 500 బీమా కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ మీరు తొందరపడి ఇంజన్ ను కదిలిస్తే ఆ బీమా సొమ్ము ఇచ్చేందుకు కంపెనీ నిరాకరించవచ్చు. ఇంజనులో నీరు చేరిందని భావిస్తే, కనీసం ఒక్కసారి కూడా ఇగ్నిషన్ ఉపయోగించవద్దన్నది నిపుణుల సూచన. వాహనాన్ని అక్కడే ఉంచి సర్టిఫైడ్ నిపుణుడితో పరీక్షింపజేస్తే మీ వెహికిల్ డ్యామేజీ ఖర్చు భారం మీపై పడకుండా చూసుకోవచ్చు. మీ వాహనానికి ఇంజన్ ప్రొటెక్టర్ యాడ్ ఆన్ కవరేజీ తీసుకున్నట్లయితే, ఇంజన్ మరమ్మతులకు అయ్యే ఖర్చు కూడా మీరు క్లయిమ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా, కొత్త ఆయిల్, సైలెన్సర్, ఇగ్నిషన్ తదితరాల రిపేరుల నిమిత్తం డబ్బు అందుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ కారిపోవడం, గేర్ బాక్స్ సాఫ్ట్ గా లేకపోవడం వంటివి గుర్తిస్తే, వాటిని స్వీయ తప్పిదంగా కంపెనీలు భావించి క్లయిములను తిరస్కరిస్తాయి. వాహనదారులకు 'రోడ్ సైడ్ అసిస్టెన్స్' రైడర్ ఉంటే అనుకోని సమయాల్లో ప్రయాణం మధ్యలో వాహనం ఆగితే రిపేర్ల భారం ఉండదు సరికదా, బీమా కంపెనీకి విషయం తెలిపితే, కారును సర్వీస్ సెంటరుకు తీసుకువెళ్లడం దగ్గర్నుంచీ రిపేరు వరకూ మొత్తం చూసుకుంటుంది. వర్షాకాలంలో ఈ రైడర్ వాహన యజమానులకు ఎంతో ఉపకరిస్తుందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ క్లయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్ దత్తా సలహా ఇస్తున్నారు. 'జీరో డిప్రిసియేషన్' పేరిట అందుబాటులో ఉన్న మరో ముఖ్యమైన కవరేజిలో భాగంగా, ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ జరిగితే, వాహన విడిభాగాలు, మరమ్మతులకు ఏ విధమైన తగ్గింపు లేకుండా పూర్తి డబ్బును క్లయిమ్ చేసుకవచ్చు. ఈ యాడ్ ఆన్ కవరేజీలను వాహనాలకు బీమా చేయిస్తున్నప్పుడు లేదా రెన్యువల్ సమయంలో ఐడీవీ (ఇన్స్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)పై 0.2 నుంచి 0.25 శాతం వెచ్చించి కొనుగోలు చేయవచ్చు.

  • Loading...

More Telugu News