: గ్రీస్ కష్టాలతో అందివచ్చిన అవకాశాలు!
యూరోజోన్ లోని గ్రీసులో నెలకొన్న ఆర్థిక కష్టాలు గత కొన్ని సెషన్లుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడిని తెచ్చాయి. ఐఎంఎఫ్ గతంలో ఇచ్చిన రుణం తిరిగి చెల్లించలేదు సరికదా, దానిపై వడ్డీని కట్టేందుకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితిలో, సాయం చేసే దేశం లేక గ్రీస్ దివాలా ప్రకటన చెయ్యాల్సిన స్థితి నెలకొనడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ప్రపంచంలోని పెద్ద స్టాక్ మార్కెట్ సూచీలయిన సీఏసీ-40, డీఏఎక్స్ (యూరప్), షాంగై కాంపోజిట్ (చైనా), హాంగ్ సెంగ్ (హాంకాంగ్), నిక్కీ (జపాన్), స్ట్రెయిట్స్ టైమ్స్ (సౌత్ కొరియా), సెన్సెక్స్ తదితరాలు 1 నుంచి 10 శాతం వరకూ నష్టపోయాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్ల వ్యవధిలో (జూన్ 23 నుంచి) ఇండియా వీఐఎక్స్ (వొలాటిలిటీ ఇండెక్స్ - ఒడిదుడుకులను చూపే సూచి) 26 శాతం పెరిగింది. నిఫ్టీ కీలకమైన 8,350 పాయింట్ల వద్ద మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పలు అవకాశాలను దగ్గర చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్లలోని ఒడిదుడుకులకు ఆసియా మార్కెట్ల స్పందన తాత్కాలికమేనని అభిప్రాయపడ్డ రీసెర్చ్ సంస్థ నోమురా, మార్కెట్ పతనమవుతుంటే, స్టాక్స్ ఆకర్షణీయంగా మారుతాయని, ఎంపిక చేసుకున్న కంపెనీల్లో ఈక్విటీలు కొనుగోలు చేయవచ్చని వివరించింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 8 వేల నుంచి 8,400 పాయింట్ల మధ్య కదలాడవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ భావిస్తోంది. యూరప్ సంక్షోభం భారత ఐటీ, ఫార్మా, వాహన కంపెనీలకు లాభిస్తుందని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఎండీ నీలేష్ షా వివరించారు. తదుపరి మార్కెట్ భారీ ర్యాలీకి గ్రీస్ కష్టాలు ఓ చిన్న 'బ్రేక్' మాత్రమేనని, ఒకసారి స్థిరపడి ముందుకు కదిలితే భారత మార్కెట్ మంచి లాభాలను అందిస్తుందని మెక్వయిర్ క్యాపిటల్ సెక్యూరిటీస్ ఇండియా రీసెర్చ్ హెడ్ రాకేష్ అరోరా అభిప్రాయపడ్డారు.