: లండన్ లో మోదీని కలవలేదు: షారూక్ ఖాన్
తాను లండన్ పర్యటనలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని కలిశానని వచ్చిన వార్తలను బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఖండించారు. కోల్ కతా నైట్ రైడర్స్ యజమానిగా మాత్రమే లలిత్ మోదీతో తనకు సంబంధం ఉందని, అది కూడా ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలోనేనని షారూక్ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన రోజున లండన్ లో లేనని, షూటింగ్ నిమిత్తం బల్గేరియాలో ఉన్నానని ఆయన తెలిపారు. అంతకుముందు రోజు రాత్రి 6 గంటల వరకూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామని, ఆపై విమానాశ్రయానికి వచ్చి రెండు గంటల సమయంలో విమానం ఎక్కి తదుపరి రోజు సాయంత్రం ఆరింటికి దిగామని, ఆ వెంటనే తన కొడుకు, కూతురు స్కూల్ అడ్మిషన్ పనుల్లో బిజీ అయ్యానని ఖాన్ తెలిపారు. తనకు లండన్ లో సమయమే లేదని, లలిత్ మోదీని కలవలేదని చెప్పిన ఆయన, తాను కలిసుంటే, ఈ పాటికి మోదీ అందరికీ చెప్పి వుండేవాడని అన్నారు.