: నెల రోజుల రిమాండుకు తెరపడేనా?... రేవంత్ బెయిలుపై నేడు తీర్పు
దాదాపు నెల రోజుల కారాగార వాసానికి తెరపడేనా? ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి బెయిలు వస్తుందా? రాదా?... తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకూ ఇదే చర్చ. ఈ కేసులో నిన్న అటు రేవంత్ లాయర్లు, ఏసీబీ తరపు ప్రాసిక్యూటర్ తమ వాదనలను గట్టిగానే వినిపించారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని, నాలుగో నిందితుడు దొరకలేదని, నోటీసులు ఇచ్చి విచారించాల్సిన వారు చాలా మందే ఉన్నారని ఏసీబీ వాదించింది. రేవంత్ కు బెయిలిస్తే, ఆయన పార్టీ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున విచారణకు విఘాతం కలుగుతుందని కోర్టుకు విన్నవించింది. ఇదే సమయంలో రేవంత్ తరపు న్యాయవాదులు కల్పించుకుని ఇప్పటికే తమ క్లయింటు చెప్పాల్సిన వివరాలన్నీ ఏసీబీ అధికారుల ఇంటరాగేషన్ లో వెల్లడించారని, ఇక చెప్పేదేమీ లేదని బెయిలివ్వాలని కోరారు.