: తెలంగాణను తాకకుండా ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ఏపీ ఎక్స్ ప్రెస్ రైలును విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నడిపితేనే సార్థకత లభిస్తుందని, ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు పంపామని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలియజేశారు. ఏపీ ఎక్స్ ప్రెస్ ను విశాఖ మీదుగా నడిపించాలని భావిస్తున్నామని, దాదాపుగా అందుకు నిర్ణయం జరిగిపోయిందని ఆయన అన్నారు. ఈ రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని వివరించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తనున్నట్టు తెలిపారు. కాగా, విశాఖపట్నం మీదుగా ఏపీ ఎక్స్ ప్రెస్ ను నడపాలంటే తూర్పు కోస్తా రైల్వే జోన్ అంగీకారం పొందాల్సి ఉంటుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తూర్పు కోస్తా రైల్వే అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి విశాఖ, రాయ్ గఢ్ మీదుగా రైలును నడపాలని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే తెలంగాణను తాకకుండా ఏపీ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ చేరుతుంది.