: భారత యుద్ధ ట్యాంకు సూపర్ అంటున్న చైనా సైన్యం
భారత్ తయారీ యుద్ధ ట్యాంక్ 'అర్జున్'పై చైనా మిలిటరీ వర్గాలు ప్రశంసల జల్లు కురిపించాయి. 'అర్జున్' చాలా మంచి ట్యాంకు అని, భారత పరిస్థితులకు అది తగిన ట్యాంకు అని చైనా ఆర్మీ అధికారి తెలిపారు. ఇప్పటిదాకా తన సైనిక స్థావరాల్లో భారత మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించిన చైనా అధినాయకత్వం ఇప్పుడు రూటు మార్చింది. ఇరు దేశాల సైనిక సంబంధాల పురోభివృద్ధి నేపథ్యంలో, కీలక రక్షణ రంగ సంస్థల ద్వారాలను భారత మీడియా కోసం తెరిచింది. ఈ క్రమంలో చైనా వెళ్లిన భారత మీడియా బృందాన్ని అక్కడి అకాడమీ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఇంజినీరింగ్ సైనిక సంస్థను సందర్శించేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా భారత మీడియా ప్రతినిధులతో సీనియర్ కల్నల్ లియో డెగాంగ్ మాట్లాడుతూ... 'అర్జున్' మెరుగైన యుద్ధ ట్యాంకు అని పేర్కొన్నారు. భారత స్థితిగతులకు అతికినట్టు సరిపోయే ట్యాంకు అని కితాబిచ్చారు. రష్యా తయారీ ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడే భారత్ ఇటీవల కాలంలో దేశీయంగానే ఆయుధాల తయారీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో థర్డ్ జనరేషన్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకుగా పేరుగాంచిన 'అర్జున్'ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రూపొందించింది.