: మీడియా ముందుకు వస్తా... అన్ని అంశాలపై మాట్లాడతా: పవన్ కల్యాణ్
ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న అన్ని పరిణామాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేస్తానని జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్న ఓటుకు నోటు, సెక్షన్-8, ఫోన్ ట్యాపింగ్ పై తన అభిప్రాయాలను వెల్లడిస్తానని పవన్ ట్విట్టర్లో తెలిపారు. ఈ వారం చివర్లో కాని, వచ్చే వారం ప్రారంభంలో కాని మీడియా ముందుకు వస్తానని, అన్ని విషయాలపై మాట్లాడతానని స్పష్టం చేశారు. ఇటీవల వైకాపా నేతలు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నిస్తామంటూ వచ్చిన జనసేన ఎందుకు మౌనంగా ఉందని వైకాపా నేతలు నిలదీస్తున్నారు. మరోవైపు, చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్టులా పవన్ వ్యవహరిస్తున్నారని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ క్రమంలో, మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను వెల్లడిస్తానని పవన్ స్వయంగా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మీడియా సమక్షంలో పవన్ ఎలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తారో అన్న ఉత్కంఠ మొదలైంది.