: యాసిడ్ దాడి కేసులో ట్విస్ట్... తన ప్లాన్ కు తానే బలైన ప్రియురాలు!
కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన యువతే నిందితురాలని తేల్చారు. మరో పెళ్లికి సిద్ధపడ్డ తన ప్రియుడిపై దాడికి ప్లాన్ చేసిన ఆమె ప్రయత్నం బెడిసి కొట్టిందని పోలీసులు వివరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, తనతో సహజీవనం చేస్తున్న కఠారి రాజేష్ కు పెళ్లి నిశ్చయం కాగా, మనస్తాపానికి గురైన రాణి అనే యువతి, అతడిపై యాసిడ్ తో దాడి చేసేందుకు ఇద్దరు యువకులతో డీల్ మాట్లాడుకుంది. అందులో భాగంగా, రాజేష్ ను తీసుకుని ద్విచక్ర వాహనంపై కృష్ణా జిల్లా, గన్నవరం మండలం బుడమేరు వంతెన వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఇద్దరు యువకులు వచ్చి యాసిడ్ చల్లారు. ఈ ప్రమాదంలో బైకు అదుపుతప్పి రాణి కిందపడగా, తలకు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, కేసు మిస్టరీ వీడిందని పోలీసులు చెప్పారు.