: అధికార పార్టీ నేత కోళ్లు పోయాయట... వెతికి పట్టుకోవాలంటూ గవర్నర్ నుంచి పోలీసులకు ఆదేశాలు!
ఏదేమైనప్పటికీ ఉత్తరప్రదేశ్ స్టైలే వేరు. రాజకీయ నేతలైనా, చివరకు ప్రజలైనా... వారి రూటే సెపరేటు. సమాజ్ వాది పార్టీకి చెందిన మంత్రి అజాంఖాన్ కు చెందిన ఏడు గేదెల దొంగతనం ఆ రాష్ట్ర పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన ఉదంతాన్ని మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి సంభవించింది. రాంపూర్ లోని మొహల్లా బంగ్లాకు చెందిన ఒక ఎస్పీ నేతకు చెందిన డజను కోళ్లు పోయాయట. దీంతో, సదరు నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. "మనుషులకే దిక్కులేదు... ఈ కోళ్ల గోలేంట్రా బాబూ" అంటూ పోలీసులు లైట్ గా తీసుకున్నారు. దీంతో, ఆగ్రహానికి గురైన సదరు నేత ఏకంగా రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే, గవర్నర్ కార్యాలయం నుంచి పోలీసులకు కోళ్ల కేసును దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు అందాయి. దీనిపై, పోలీసు ఉన్నతాధికారులు సైతం విస్తుపోతున్నారట.