: ఆరోగ్యం బాగా లేదని వెళుతుంటే, రక్షక్ వాహనంతో ఢీకొట్టిన పోలీసులు


తమ బిడ్డకు అనారోగ్యంగా ఉందన్న తొందరలో పోలీసులు ఆపినా పట్టించుకోని కారును వెంబడించి, దాన్ని రక్షక్ వాహనంతో ఢీకొట్టి పల్టీలు కొట్టించారు పోలీసులు. ఈ ఘటన గుంటూరు పరిధిలోని నల్లపాడులో జరిగింది. నిన్న రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఉన్నం సైదమ్మ, లక్ష్మయ్య దంపతులు ఓ శుభకార్యం నిమిత్తం పిడుగురాళ్ల మండలం కరాలపాడు వెళ్లారు. మనవడికి అనారోగ్యంగా ఉండడంతో చికిత్స కోసం వారు కారులో గుంటూరుకు బయలుదేరారు. పేరేచర్ల వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారును ఆపాలని సూచించగా, బిడ్డకు బాగా లేదని సమాధానమిస్తూ, డ్రైవర్ సైదారావు కారును పోనిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు, రక్షక్ వాహనంలో వెంబడించి కారును ఢీకొట్టారు. ఆ కారు అదుపుతప్పి పల్టీకొట్టింది. పోలీసుల తీరును తప్పుబడుతూ, బాధితులు, పేరేచర్ల గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు వచ్చి ఘటనకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News