: మోదీ 'రాజే ధర్మాన్ని' పాటిస్తున్నారు: కాంగ్రెస్
రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ దాడి కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మోదీ 'రాజ్య ధర్మాన్ని' కాకుండా 'రాజె ధర్మాన్ని' పాటిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పనిసరిగా 'రాజ్య ధర్మాన్ని' పాటించాలి. అంతేగానీ 'రాజే ధర్మాన్ని' లేదా 'లలిత్ ధర్మాన్ని' పాటించకూడదు" అని వసుంధర రాజే పేరును పరోక్షంగా ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన మోదీ... అవినీతి, నల్లధనం అంశాలపై ఆయన స్పందన చాలా నిరాశాజనకంగా ఉందని కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాల్లో మోదీ చర్యలు తీసుకోకపోయినప్పటికీ భారీగా నల్లధనం ఉన్న వారికి రక్షకుడిగా మారారని విమర్శించారు.