: అరుణ్ జైట్లీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలు చేయడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. గతంలో అరుణ్ జైట్లీ రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని చెప్పారని తెలిపారు. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలపై అధికారాలను గవర్నర్ కు అప్పగించడం కుదరదని జైట్లీ అన్నారని తెలిపారు. ఆయన న్యాయకోవిదుడని, అన్నీ తెలిసిన వ్యక్తి అని, ఇప్పుడాయన కేంద్ర మంత్రిగా ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో కేంద్రం సెక్షన్-8 అమలు నిర్ణయం తీసుకుని చిక్కులు కొనితెచ్చుకుంటుందని తాము భావించడం లేదని కేటీఆర్ చెప్పారు. రాజ్యాంగ సవరణ చేయకుండా సెక్షన్-8 అమలు అసాధ్యమని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అనవసరంగా ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రజలపై రుద్దుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఐదు కోట్ల మంది సమస్య అంటూ తన సమస్యను ప్రజల సమస్యగా చిత్రించే ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన తాపత్రయమంతా తనను తాను రక్షించుకోవడానికే అని విమర్శించారు. చంద్రబాబు తన స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే బాగుంటుందని హితవు పలికారు. కానీ, ఆయన కేసులోంచి బయటపడేందుకు పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ దిక్కుమాలిన కేసుతో ఏపీ ప్రజలకు సంబంధం లేదని, ప్రజలందరూ ప్రశాంతంగానే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.