: శునకాల కోసం ప్లాట్లను అమ్మేశారు... క్యాన్సర్ సోకితే 'బసవతారకం'లో చికిత్స!
మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ప్రస్తుత కాలంలో జంతువులను పట్టించుకునేవాళ్లెవరుంటారు? వీధుల్లో తిరిగే కుక్కలను భరించేందుకు ఎవరు సిద్ధపడతారు? అయితే, నెక్కలపూడి సోనీ, ఆమె భర్త శివరాం వంటి వ్యక్తులకు అందుకు మినహాయింపునివ్వాలి. హైదరాబాదులోని కూకట్ పల్లి ప్రాంతంలోని వట్టినాగులపల్లికి చెందిన ఈ దంపతులకు శునకాలంటే ఎనలేని ప్రేమ. ఎంత ప్రేమంటే... వాళ్లు కుక్కల కోసమే రెండు ప్లాట్లను అమ్మేశారు మరి! ఓ 50 శునకాలను సోనీ దంపతులు సంరక్షిస్తున్నారు. వారు అమెరికాలో ఉన్నా అప్పుడప్పుడు వచ్చి పర్యవేక్షిస్తుంటారు. వాటి ఆలనపాలన కోసం ఎకరం పొలంలో ప్రత్యేకంగా షెడ్లు, ఓ వెటర్నరీ వైద్యుడు, ఇద్దరు సహాయకులు, సోలార్ ఇన్వర్టర్ సమకూర్చారు. వాటి సంరక్షణ కోసం నెలకయ్యే ఖర్చు దాదాపు లక్షా ఇరవై వేల రూపాయలట! కాగా, ఓ శునకానికి క్యాన్సర్ సోకితే కుటుంబ సభ్యుడే అనారోగ్యం పాలైనంతగా విలవిల్లాడిపోయారీ దంపతులు. వెంటనే ఆ శునకానికి హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స చేయించి తమ మూగప్రాణి ప్రేమను చాటుకున్నారు.