: పార్టీలోకి కొంతమంది వస్తున్నారు... మంచివారిని తీసుకుందాం: చంద్రబాబు


విజయవాడలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలోకి కొంతమంది నేతలు వస్తున్నారని, మంచివాళ్లకు ఆహ్వానం పలుకుదామని తెలిపారు. పార్టీ అంటే ఓ కుటుంబం వంటిదని, కుటుంబంలో అందరికీ ఆలోచనలు వస్తుంటాయని, వాటిని అందరం పంచుకుందామని సూచించారు. పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పునరుద్ఘాటించారు. పార్టీ కార్యకర్తలు 30 ఏళ్లుగా జెండా మోస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్న కార్యకర్తలను సన్మానించుకోవాలని, పార్టీకి ఎనలేని సేవలు అందించిన కార్యకర్తలను గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులను భుజం తట్టి ప్రోత్సహించాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని సూచించారు. సంక్షోభాలను తట్టుకుని ఎప్పటికప్పుడు ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, ప్రభుత్వ పనితీరు గురించి చెబుతూ... ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. రుణమాఫీతో రైతులను ఆదుకుంటున్నామని, సమస్యలు చుట్టుముట్టినా అభివృద్ధి పథకాల అమలులో రాజీపడడంలేదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News