: ఏడింటిలో రెండింటికే హేతుబద్ధత... రేవంత్ కు బెయిల్ వచ్చే అవకాశాలు!
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి మంగళవారం బెయిల్ రావడం ఖాయంగానే కనిపిస్తోంది. నిన్న వాడీవేడీగా జరిగిన విచారణలో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజాఇళంగో చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. విచారణలో భాగంగా రేవంత్ తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా, ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిలు తమ వాదనలు వినిపించారు. బెయిల్ వద్దని చెప్పిన ఏసీబీ వాదన, బెయిల్ ఇవ్వక తప్పదన్న రేవంత్ న్యాయవాది వాదనలను సావధానంగా విన్న జస్టిస్ రాజాఇళంగో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిందితుడికి బెయిల్ ఇవ్వరాదని చెబుతూ ఏసీబీ చూపిన కారణాల్లో మొత్తం ఏడు అంశాలున్నాయని జస్టిస్ రాజాఇళంగో అన్నారు. ఈ ఏడింటిలో కేవలం రెండంటే రెండు అంశాలే హేతుబద్ధంగా ఉన్నాయని చెప్పారు. అంతేకాక మిగిలిన ఐదు కారణాలకు ఏమాత్రం హేతుబద్ధత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వెలువరించనున్న తన తీర్పులో జస్టిస్ రాజాఇళంగో, రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తారన్న వాదన వినిపిస్తోంది.