: మీరు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు: ఢిల్లీలో మీడియాపై కస్సుమన్న గవర్నర్


‘‘మీరు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. కానీ, ఇలాంటి ఇంటరాగేషన్ లు నేను చాలానే చేశాను’’ అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న ఢిల్లీలో మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం పిలుపుతో మొన్న రాత్రికి రాత్రే ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ నిన్న ఉదయం నార్త్ బ్లాక్ లోని హోం మంత్రిత్వ శాఖలో చాలాసేపు బిజీబిజీగా గడిపారు. తొలుత కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన ఆ తర్వాత ఆ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ భేటీ అయ్యారు. వరుస భేటీల అనంతరం బయటకు వచ్చిన నరసింహన్ ను మీడియా చుట్టుముట్టింది. భేటీల్లో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయాలు తెలుసుకునేందుకు ఆయనపై పలు ప్రశ్నలను సంధించింది. దీంతో ‘‘అబ్బే... ప్రత్యేకతేమీ లేదు. రోటీన్ మీటింగ్’’ అంటూ ఆయన బదులిచ్చారు. అయితే మీడియా ఆయనపై మరిన్ని ప్రశ్నలను సంధించింది. ‘అటార్నీ జనరల్ అభిప్రాయం కోరడం నిజమేనా? కాకపోతే ఖండించవచ్చు కదా?’’ అన్న మీడియా ప్రశ్నకు నరసింహన్ కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘మీరు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇలాంటి ఇంటరాగేషన్ లు నేను చాలానే చేశాను’’ అని బదులిచ్చిన గవర్నర్ అక్కడి నుంచి కదిలిపోయారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఆయన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News