: ఫ్రాన్స్ లో సంచలనం రేపిన కేసుపై విచారణ ప్రారంభం
ఫ్రాన్స్ లో సంచలనం రేపిన ఎనిమిది మంది చిన్నపిల్లల హత్య కేసుపై విచారణ ప్రారంభమైంది. ఫ్రాన్స్ లోని డువే నగరానికి చెందిన డామిని కాట్రేజ్ (51) ఇంటికి ఆనుకుని ఓ తోట ఉంది. అందులో ఎనిమిది పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. ఈ మృతదేహాలపై దర్యాప్తు చేయగా పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆ ఎనిమిది మృతదేహాలు డామిని కడుపున పుట్టినవే కావడం విశేషం. అయితే ఆ ఎనిమిది మంది పసికందులు భర్త కారణంగా జన్మించలేదు. దీంతో అక్రమ సంతానాన్ని పురిట్లోనే ఊపిరాడకుండా చేసి హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా తోటలో పాతివేసింది. ఈ విషయాన్ని విచారణలో అంగీకరించింది. అయితే ఊబకాయం కారణంగా ఆమె గర్భవతి అనే విషయాన్ని ఎవరూ కనుక్కోలేకపోవడం విశేషం. ఈ కేసులో న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ కేసులో న్యాయస్థానం ఏ రకమైన తీర్పు ఇస్తుందో అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.