: ఉత్కంఠ రేపుతున్న రేవంత్ బెయిల్ విచారణ... మరోమారు హియరింగ్ వాయిదా
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు విచారణకు వచ్చిన ఈ బెయిల్ పిటీషన్ పై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు నేడు తన తుది నిర్ణయం ప్రకటిస్తుందని ప్రచారం సాగింది. అయితే నేటి ఉదయం ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు మధ్యాహ్నం 12 గంటలకు విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈ పిటీషన్ విచారణను నేటి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. కేవలం గంట వ్యవధిలో రెండు సార్లు ఈ పిటీషన్ వాయిదా పడటంతో సంచలన నిర్ణయమే వెలువడనుందన్న వాదన వినిపిస్తోంది. రేవంత్ కు బెయిలా? జైలా? అన్న విషయంపై కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ వ్యవహారంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న పరిణామాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.