: అయ్యా... నా పింఛన్ రద్దు చేయండి: అధికారులకు కరీంనగర్ వృద్ధుడి మొర!
అర్హత లేకున్నా అప్పనంగా వచ్చే సర్కారీ పింఛన్ కోసం అడ్డదారులు తొక్కే వారెందరో. అలాంటి వారికి వంతపాడుతూ జేబులు నింపుకునే అధికారులూ మనకు చిరపరిచతమే. అయితే కరీంనగర్ కార్పొరేషన్ అధికారులకు నిన్న ఓ వింత పిటీషన్ వచ్చింది. తెలంగాణ సర్కారు అందిస్తున్న ఆసరా పింఛన్ కు అన్ని అర్హతలు ఉన్న వృద్ధుడు దుర్శేటి రాములు ఈ పిటీషన్ ను అందజేశారు. ఆసరా పింఛన్ పొందేందుకు తనకు అన్ని అర్హతలున్నప్పటికీ బతికేందుకు తనకెలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పుకున్న రాములు, తనకు మంజూరైన పింఛన్ ను నిలిపివేయాలని అధికారులకు విన్నవించారు. నిన్న కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన రాములు అక్కడి డిప్యూటీ కమిషనర్ కు తన వినతిపత్రాన్ని అందించారు. గతంలో పింఛన్ దరఖాస్తుల సమయంలో పక్కవాళ్ల ఒత్తిడి మేరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పిన రాములు, నిబంధనల మేరకే తనకు పింఛన్ మంజూరైందన్నారు. అయితే చరమాంకంలో పట్టెడన్నం దొరకక నానా పాట్లు పడుతున్నవారు లెక్కలేనంత మంది ఉన్నారన్న ఆయన తక్షణమే తన పింఛన్ ను రద్దు చేసి వేరేవారికి ఇవ్వాలని కోరారు.