: నా ఆలోచనలివి... లక్ష్యాలను సాధించాల్సింది మాత్రం మీరే: అధికారులతో బాబు


రాష్ట్ర విభజన తరువాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇబ్బందులు ఇప్పటికీ తీరలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రాథమికరంగ మిషన్ అమలు తీరుపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. 2022 నాటికి భారత దేశంలో అభివృద్ధి పథంలో నిలిచే టాప్-3 రాష్ట్రాల్లో, 2029 నాటికి టాప్-1గా ఏపీ నిలవాలని, అందుకు తగ్గట్టుగా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాథమికరంగ మిషన్ ను విజయవంతం చేసేందుకు 7 మిషన్లు, 5 గ్రిడ్లతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. ఎంతమంది ప్రజలైనా నివసించేందుకు వీలుగా ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి అందరూ కట్టుబడాలని కోరారు. ప్రధాని మోదీ సూచించినట్టుగా సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చే పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. లక్ష్యాలను సమయానుగుణంగా చేరుకునేందుకు అధికారులు తమవైన ప్రణాళికలు రూపొందించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. తాను కేవలం ఆలోచనలు చేసి వాటిని మంత్రులు, అధికారుల ముందుంచుతానని, అమలు బాధ్యత, లక్ష్యాల సాధన మీరే చూసుకోవాలని ఉద్యోగులకు చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News