: వీరూ తన కెరీర్ ఇక్కడే ఆరంభించాడు... ఇక్కడే ముగించాలని కోరుకుంటున్నాం: చేతన్ చౌహాన్
దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దేశవాళీ పోటీల్లో మరో జట్టుకు ఆడేందుకు నిర్ణయించుకున్నాడని, ఢిల్లీ జట్టుకు ఇక ఆడబోవడం లేదని కథనాలు రావడం తెలిసిందే. దీనిపై ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) స్పందించింది. సెహ్వాగ్ ఢిల్లీ తరపున ఆడడం కొనసాగించాలని, కెరీర్ ఇక్కడే ముగించాలని కోరుకుంటున్నామని డీడీసీఏ ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ అన్నారు. ఈ విషయమై సెహ్వాగ్ కు కొన్నిరోజుల క్రితం ఓ ఎస్సెమ్మెస్ పంపానని, ఇప్పటిదాకా స్పందన రాలేదని తెలిపారు. సెహ్వాగ్ ఇక్కడే ఉండాలన్నది తమ అభిమతమని చెప్పారు. ఏం జరుగుతోందో తమకు తెలియడంలేదని, అతనేమన్నా మాకు చెబితే, దానిపై నిర్ణయం తెలుపగలమని అన్నారు. ఒకవేళ సెహ్వాగ్ వెళ్లిపోతే... అన్న ప్రశ్నకు బదులిస్తూ... తమకు కుర్రాళ్లున్నారని, అయితే, సెహ్వాగ్ వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అతను ఇక్కడే క్రికెట్ కెరీర్ ప్రారంభించాడని, ఇక్కడే ముగించాలని ఆకాంక్షిస్తున్నామని వివరించారు. "సెహ్వాగ్ ఓ అద్భుతమైన క్రికెటర్, ఓ చాంపియన్ ప్లేయర్. ఢిల్లీ నుంచే కాకుండా, భారత క్రికెట్ నుంచి ఉద్భవించిన అద్భుతమైన క్రికెటర్లలో సెహ్వాగ్ ఒకడు" అని చేతన్ చౌహాన్ కొనియాడారు. అతడికి డీడీసీఏతో ఏమైనా విభేదాలు ఉంటే పరిష్కరించడానికి తామున్నామని అన్నారు. సమస్యలుంటే తమతో చర్చిస్తే చాలని తెలిపారు. ఇక, ఆటగాళ్ల పారితోషికం చెల్లింపు వ్యవహారం త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.