: చెల్లని చెక్కు కేసులో కోర్టుకు నిర్మాత బండ్ల గణేష్
గతంలో ఇచ్చిన ఓ చెక్కు బౌన్స్ అయిన కేసులో టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈ ఉదయం హైదరాబాదు, నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో న్యాయస్థానానికి పూచీకత్తును సమర్పించడంతో ఆయనకు బెయిలు మంజూరైంది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. కాగా, వైకింగ్ మీడియా సంస్థ డైరెక్టర్, హీరో సచిన్ జోషి చెక్ బౌన్స్ కేసులో గణేష్ కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. 'నీ జతగా నేనుండాలి' పేరుతో 'ఆషికీ 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన సందర్భంలో వివాదం తలెత్తింది. చిత్రానికి తాను పెట్టుబడులు పెడితే, గణేష్ మోసం చేశాడని, నిలదీస్తే ఆయన చెల్లని చెక్కులు ఇచ్చాడని నోటీసుల్లో సచిన్ పేర్కొన్నాడు.