: పాక్ మాజీ కెప్టెన్ ను వరించిన ఐసీసీ అధ్యక్ష పదవి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ -ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఎంపికయ్యారు. బార్బాడోస్ లో జరిగిన ఐసీసీ వార్షిక సదస్సులో ఆయన్ను ఎన్నుకున్నట్టు ఒక ప్రకటన వెలువడింది. ఆ వెంటనే ఒక సంవత్సరం పాటు సేవలందించేలా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జహీర్ అబ్బాస్ ప్రసంగిస్తూ, "ఓ అద్భుత ఆటగా ప్రపంచంలో నిలిచిన క్రికెట్ నియంత్రణా మండలికి అధ్యక్ష బాధ్యతలు లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఆట వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, గౌరవాన్ని పెంచుతోంది. పలు దేశాలకు సేవచేసే అవకాశం లభించడం నాకెంతో గర్వకారణం" అన్నారు. తనపై నమ్మకముంచి పేరును సిఫార్సు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన తాజా మాజీ చైర్మన్, బీసీసీఐ బోర్డు సభ్యుడు ఎన్.శ్రీనివాసన్ స్వయంగా జహీర్ ను ఆహ్వానించారు. ఆయన గొప్ప క్రికెటరని అభివర్ణించారు. కాగా, కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ గా 78 టెస్టులు, 62 వన్డే పోటీలను 1969 నుంచి 1985 మధ్య కాలంలో ఆడిన ఆయన మూడు ప్రపంచ కప్ పోటీలకు పాకిస్థాన్ తరపున ప్రాతినిధ్యం వహించారు. వన్డేల్లో 2,572, టెస్టుల్లో 5,062 పరుగులు చేశారు. పాకిస్థాన్ ఆడిన 14 టెస్టులకు, 13 వన్డే పోటీలకు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆసియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100 సెంచరీలను దాటిన ఘనమైన రికార్డు అతని పేరిటే ఉంది. మూడు వరుస వన్డే పోటీల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్ మెన్ కూడా జహీర్ అబ్బాస్ కావడం గమనార్హం.