: చదువుపై ఆసక్తి లేక విష గుళికలు మింగిన ‘అనంత’ విద్యార్థులు... ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా యాడికి మండలం పి.వెంగన్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చదువుపై ఆసక్తి లేని ఓ ముగ్గురు టెన్త్ విద్యార్థులు విష గుళికలు మింగేశారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు వేగంగా స్పందించినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు మృత్యువాతపడగా, మరో విద్యార్థి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకెళితే... రాజు, నగేశ్, చంద్రమోహన్ రెడ్డిలు పదో తరగతి చదువుతున్నారు. కొంతకాలంగా చదువుపై ఆసక్తి లేదని వాపోయిన విద్యార్థులు నిన్న సాయంత్రం విష గుళికలు మింగేశారు. వెనువెంటనే స్పందించిన వారి కుటుంబ సభ్యులు ముగ్గురిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా... రాజు, నగేశ్ లు అప్పటికే చనిపోయారు. ఇక కొన ఊపిరితో ఉన్న చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.