: ఆ తెగలో మహిళలకు స్వేచ్ఛ ఎక్కువ... పురుషులే బురఖా ధరిస్తారు!
ప్రపంచంలో ఎన్నో జాతులు, తెగలు ఉన్నాయి. బాహ్య ప్రపంచానికి తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. వాటిలో సగం తెగల ఆచార సంప్రదాయాలు ఎవరికీ తెలియవంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఓ చిత్రమైన తెగ సంప్రదాయాలు తెలుసుకుందాం...'జంబలకిడి పంబ' సినిమా గుర్తుందా? అచ్చం అలాగే కాదు కానీ, ఇంచుమించు సగం ఆ సినిమాలోలాగ జీవించే ఓ తెగ ఉంది తెలుసా? సహారా ఎడారి ప్రాంతంలో 'త్వారెగ్' అనే సంచారజాతి ఉంది. ఈ తెగలో పురుషులు బురఖాలు ధరించాల్సి ఉంటుంది. మహిళలు వివాహం చేసుకునేంత వరకు ఎంతమందితోనైనా గడపవచ్చు. అలా యువతికి నచ్చిన యువకుడు వారి గుడారంలోకి వస్తే, ఇతర కుటుంబ సభ్యులు వారికి తెలియనట్టు వ్యవహరించాలి. లేదా గుడారంలో వారికి ప్రైవసీ కల్పించి బయటికెళ్లిపోవాలి. అలాగని ఎప్పుడంటే అప్పుడు ఈ తంతు జరగకూడదు. రాత్రి పొద్దుపోయిన తరువాత మాత్రమే యువకుడు ప్రేయసి గుడారంలోకి వెళ్లాలి, తెల్లవారక ముందే గుడారం నుంచి బయటపడాలి. పెళ్లి తరువాత మాత్రం అలా చేయకూడదు. కేవలం భర్తతోనే వుండాలి! ఇక్కడ ఇంకో వెసులుబాటు ఉంది. వివాహానంతరం మహిళకు పురుషుడు ఎప్పుడైనా నచ్చకపోతే వెంటనే విడాకులు ఇవ్వవచ్చు. అలాగే మహిళలు ఎన్నిసార్లైనా వివాహం చేసుకోవచ్చు. ఈ తెగలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఒంటెలపై స్వారీలు చేస్తారు. మహిళకు 20 ఏళ్లు వచ్చాకే వివాహం చేస్తారు. వివాహం ఎంత వేడుకగా నిర్వహిస్తారో అంతే సంబరంగా విడాకులు కూడా తీసుకుంటారు. అలా ఎందుకు విడాకులు తీసుకుంటారంటే ఇంకో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నామని ఇతర పురుషులకు తెలియచెప్పడానికి అని అంటారు. వివాహ సమయంలో మహిళలు వరకట్నంగా గుడారం, ఒంటె, గాడిదలు వంటివి ఇస్తారు. విడాకులు తీసుకుంటే మాత్రం పిల్లలు మహిళలతో ఉండిపోతే, పురుషులు వారి తల్లి చెంతకు చేరాల్సిందే. వివాహం జరిగిన పురుషుడు, భార్య, ఇతర మహిళల ముందు భోజనం చేయకూడదు. ఇప్పుడిప్పుడే ఈ విధానంలో కాస్త మార్పు వచ్చింది. భార్య ముందు భోజనం చేయొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అత్త ముందు భోజనం చేయకూడదు. ఇది వెయ్యేళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఇంటి పెద్ద మహిళే అయినప్పటికీ నిర్ణయాలు తీసుకునేది పురుషులే. రాజకీయాలు నిర్వహించేది కూడా పురుషులే కావడం విశేషం. ఇంట్లో వంటా వార్పు, పిల్లల పోషణ మహిళలే చూసుకుంటారు. వీరు గొర్రెలు, ఒంటెలు, గాడిదలపై ఆధారపడి జీవనం సాగిస్తారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ సంచారజాతి 'అరబిక్'కు దగ్గరగా ఉండే భాష మాట్లాడుతారు. ముస్లిం మతాన్ని ఆచరిస్తారు. పురుషులే బురఖా ధరించాలి. మహిళలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవించాలి. ఇప్పుడీ తెగ ప్రమాదంలో పడింది. మత ఛాందసవాదం వీరిలో లేదని దాడులు జరుగుతున్నాయి. వీరిపై దాడులకు దిగే బోకోహరం ఉగ్రవాదులు మహిళలను బానిసలుగా చేసుకుంటున్నారు. కొన్ని సంచార కుటుంబాలు కలిపి ఉండేందుకు కృషి చేసిన మహిళను 'షీ ఆఫ్ ది టెంట్' గా ఎన్నుకుంటారు. ఈ తెగ జనాభా కోటిన్నర. మోలి, నిగర్, ఉత్తర నైజీరియా, ఆగ్నేయ లిబియా, అల్జీరియా దేశాల్లో నివసిస్తున్నారు.