: అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు నిలుస్తాడా?
అమెరికా అధ్యక్ష పోటీలో భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ నిలవనున్నారా? లేదా? అనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. డెమొక్రాట్ల సిసలైన ప్రత్యర్థిగా నీరాజనాలు అందుకుంటున్న రిపబ్లికన్ పార్టీకి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్, 2016లో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారా? లేదా? అనేది కాసేపట్లో తేలిపోనుంది. సమీకరణాలన్నీ జిందాల్ ను భవిష్యత్ అధ్యక్షుడిగా చూపుతున్నప్పటికీ, రిపబ్లికన్ల ఆలోచన ఏంటి? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది. రిపబ్లికన్ల తరుపున మొత్తం 11 మంది అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. వారిలో 2008లో ఒబామాతో పోటీ పడి ఓడిపోయిన మైక్ హుక్కాబీ, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సోదరుడు, ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్, ప్రముఖ న్యూరో సర్జన్ బెన్ కార్సన్, టెక్సాస్ సెనెటర్ టెడ్ క్రూజ్, హెచ్ పీ మాజీ సీఈవో కార్టీ ఫియోరీనా, లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ లు ప్రధానంగా ఉన్నారు. పాలనా పరమైన అనుభవంతోపాటు, సమర్థవంతమైన గవర్నర్ గా బాబీ జిందాల్ నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీలో కీలకమైన రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్ కు జిందాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. డెమొక్రాట్లను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయడంలో జిందాల్ ను మించిన వారు లేరని, జిందాల్ కు 'వోకల్ క్రిటిక్ ఆఫ్ ఒబామా' అనే పేరుందని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో జిందాల్ భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి రేసులో నిలవడం జరిగితే అది భారతీయులకు గర్వకారణమే. డెమొక్రాట్ పార్టీ తరపున భవిష్యత్ అధ్యక్ష పదవి రేసులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ ఉన్నారు.